డిసెంబర్ 12న నేషనల్ లోక్ అదాలత్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్షా సమావేశంలో భాగంగా కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం ఇంజనీరింగ్ విభాగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సిబ్బందికి నిర్దేశించిన తాగునీటి కుళాయి పన్నుల లక్ష్యాలను కచ్చితంగా వసూలు చేయాలని ఆదేశించారు. నగరంలోని అనధికారిక కుళాయిలను గుర్తించి వాటిని రెగ్యులరైజ్ చేయించాలని సూచించారు.
డిసెంబర్ నెల 12 వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా తాగునీటి కుళాయి పన్నుల వసూలు చర్యలను బకాయీదారులకు అవగాహన కల్పించి పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చెల్లించని వారి వివరాలను నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా నోటీసులను అందజేయాలని సూచించారు.
నగర వ్యాప్తంగా రోడ్లపై ఉన్న గుంతలు, అవసరమైన మరమ్మతు చర్యలను నివేదికల ద్వారా తెలియజేయాలని సూచించారు.
తాగునీటి పైప్ లైన్లు, వాల్వుల వద్ద లీకేజీలు లేకుండా వాల్వ్ ఆపరేటర్లు జాగ్రత్తలు తీసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి కాలుష్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
పట్టణ ప్రణాళికా విభాగం నుంచి ప్రభుత్వ ఖాళీ స్థలాల వివరాలను సేకరించి, ఆయా స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
గత రెండేళ్లలో నిర్మాణాలు పూర్తయిన భవనాలు, ఇతర నిర్మాణాలను పరిశీలించి, తాగునీటి కుళాయి కనెక్షన్లు, పన్నుల వివరాలను ఇతర విభాగాలతో సరిపోల్చి చూడాలని, పన్నులేని వాటిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇంజినీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, చంద్రయ్య, ఏ.ఈ లు, సచివాలయం అమెనిటీస్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.