దీపావళి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుభాకాంక్షలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఐకమత్యం, సోదరభావం, పరస్పర సహకారంతో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పండుగ వేళ ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల పురోగతికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తూ, ప్రజల భాగస్వామ్యంతో నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దీపావళి పండుగను పర్యావరణ హితంగా, సురక్షితంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నారుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ దీపావళి జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి, నెల్లూరు జిల్లా అభివృద్ధికి, ప్రజలందరి శ్రేయస్సుకు నూతన ఉత్సాహాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.