జగన్ ఒక ‘కంస మామ’.. కొడుకుగా, అన్నగా పూర్తిగా విఫలమయ్యారు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు..
సూర్య పొలిటికల్ బ్యూరో, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక "కంస మామ"లా మారారని, ఆయన ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా కొడుకుగా, అన్నగా, మేనమామగా, బాధ్యతాయుత పౌరుడిగా అన్ని విధాలా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హింసను ప్రేరేపిస్తూ 'హిట్ అండ్ రన్' రాజకీయాలకు పాల్పడుతోందని, అబద్ధాలతో కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
కుటుంబ విలువలపై సీఎం తీవ్ర విమర్శలు:
వైఎస్ జగన్ వ్యక్తిగత, నైతిక విలువలను ప్రశ్నిస్తూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు:
* వైఎస్ షర్మిలతో ఉన్న ఆస్తి వివాదాలను ప్రస్తావిస్తూ.. సొంత మేనకోడలి పెళ్లి కోసం ఫ్యామిలీ హౌస్‌ను ఉపయోగించుకోవడానికి కూడా జగన్ అంగీకరించకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
తల్లి, చెల్లికి ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తూ వారిపైనే కేసులు పెట్టే స్థాయికి దిగజారారని, కుటుంబ సభ్యులపై వ్యక్తిగత కక్షలు సాధిస్తున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ అసలైన నిందితులను కాపాడేందుకు సొంత కుటుంబ సభ్యులపైనే నిందలు మోపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
హింసను సృష్టించి బాధితులుగా నటిస్తున్నారు – 'క్రిమినల్ లిటిగెంట్':
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలే దాడులకు తెగబడుతూ, మళ్లీ తమకే అన్యాయం జరిగిందంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, తంబళ్లపల్లె, కడప, తిరుపతిలలో ఎన్డీయే కార్యకర్తలపై దాడులు చేశారని, నామినేషన్లను అడ్డుకున్నారని ఆరోపించారు. ఒక ఎంపీ వాహనంతో ఎన్డీయే కార్యకర్తలను తొక్కించే ప్రయత్నం జరిగిందని, ఆ వాహనంలో మద్యం బాటిళ్లు, ఆయుధాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ఒక 'క్రిమినల్ లిటిగెంట్'గా మారారని ధ్వజమెత్తారు.
గతంలో ఏకగ్రీవాల పేరుతో బెదిరింపులు – ఇప్పుడే అసలైన ప్రజాస్వామ్యం:
గత వైఎస్సార్సీపీ పాలనలో భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని సీఎం గుర్తుచేశారు. "గతంలో పులివెందులలోని మొత్తం 33 స్థానాలు, కడప జిల్లాలో 79% ఎంపీటీసీ, 76% జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ మా కూటమి ప్రభుత్వం రాజ్యాంగం, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తోంది" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు (ఎన్డీయే 27,772; వైఎస్సార్సీపీ 20,556), 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు (ఎన్డీయే 3,012; వైఎస్సార్సీపీ 1,815) దాఖలయ్యాయని, ప్రతిపక్షాలకు నామినేషన్లు వేసే పూర్తి స్వేచ్ఛ ఉందని గణాంకాలతో వివరించారు.