వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం మెరుపు దాడులు..
హెబ్రాన్‌లో 2,000 మందికి పైగా పాలస్తీనియన్ల బలవంతపు తరలింపు: ఇళ్ల కూల్చివేతలు, పూర్తిస్థాయి దిగ్బంధనం!
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, హెబ్రాన్/జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ (West Bank) ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. హెబ్రాన్ నగర శివార్లలోని చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించిన ఘటన అనంతరం ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) నగరంలో భారీ సైనిక చర్యను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా హెబ్రాన్‌లోని అల్-జల్దా, ఐన్ దిర్ బహా ప్రాంతాల నుంచి దాదాపు 250కి పైగా కుటుంబాలను అర్ధరాత్రి వేళ ఇళ్ల నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. ఫలితంగా ఇప్పటివరకు 2,000 మందికి పైగా పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారని స్థానిక మున్సిపాలిటీ అధికారులు, అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఇళ్లపై నల్లటి ‘X’ గుర్తులు – బుల్డోజర్లతో కూల్చివేతలు:
ఇజ్రాయెల్ సైన్యం హెబ్రాన్ నగరంలోకి డజన్ల కొద్దీ సాయుధ వాహనాలు, భారీ బుల్డోజర్లతో ప్రవేశించి తీవ్రస్థాయి తనిఖీలు చేపట్టింది. ఖాళీ చేయించిన ఇళ్ల గోడలపై నల్లటి సిరాతో 'X' ఆకారపు గుర్తులు వేసి, నివాసితులను నగర సరిహద్దుల వైపు కాలినడకన పంపించివేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెక్‌పోస్ట్ దాడికి పాల్పడిన వారి ఇళ్లతో పాటు సమీపంలోని నివాస భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలను సైన్యం నేలమట్టం చేసింది. ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించే క్రమంలో భారీగా కాల్పులు జరపడంతో పాటు అనుమానితులను నిర్బంధించి విచారిస్తున్నారు.
నగరం పూర్తి దిగ్బంధనం – ఇబ్రహీమీ మసీదు మూసివేత:
సైనిక చర్య నేపథ్యంలో హెబ్రాన్ గవర్నరేట్‌కు దారితీసే అన్ని ప్రధాన ద్వారాలను ఇనుప గేట్లు వేసి మూసివేశారు. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విద్యాసంస్థలు తరగతులను నిలిపివేయగా, చారిత్రక ఇబ్రహీమీ మసీదులోకి ముస్లిం ప్రార్థనలను నిషేధించి సిబ్బందిని సైన్యం బయటకు పంపింది. నిరాశ్రయులైన కుటుంబాల కోసం హెబ్రాన్ మున్సిపాలిటీ ఎమర్జెన్సీ షెల్టర్లను ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు అందిస్తోంది.
నెతన్యాహు హెచ్చరిక – పాలస్తీనా అధీన సంస్థ ఆగ్రహం:
హెబ్రాన్ పరిసరాలను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. సైనికులపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లో అమలు చేసిన తరహా విస్తృత కూంబింగ్ చర్యలను హెబ్రాన్‌లోనూ చేపడతామని హెచ్చరించారు. మరోవైపు, ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం సాధారణ ప్రజలపై సామూహిక శిక్ష (Collective Punishment) విధిస్తోందని, బలవంతపు బహిష్కరణలను తక్షణమే ఆపాలని పాలస్తీనా అథారిటీ (PA) ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.