చేనేత ముడి సరుకుల ధరలు తగ్గించాలి వార్పు, సపూరి, జరీని సబ్సిడీపై అందించాలి ఆర్డీవోకు చేనేత కార్మిక సంఘం వినతి
అనంతపురం బ్యూరో : చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వార్పు, సపూరి, జరీ తదితర ముడి సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని, ప్రభుత్వం సబ్సిడీపై వాటిని అందించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ జె.వి. రమణ, జిల్లా నాయకులు ఎస్.హెచ్. భాష మాట్లాడుతూ ధర్మవరం ప్రాంతంలో సుమారు 15 వేల మగ్గాలు ఉన్నాయని తెలిపారు. మగ్గాలకు అవసరమైన వార్పు, సపూరి, జరీ, సరఫరా సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముడి సరుకుల ధరలు పెరుగుతున్నప్పటికీ, చేనేత ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. దీంతో వేలాది చేనేత కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, కుటుంబ పోషణ భారంగా మారుతోందని తెలిపారు. తరతరాలుగా కొనసాగిస్తున్న చేనేత వృత్తిని వదులుకోలేక, ప్రత్యామ్నాయ ఉపాధి పొందలేక కార్మికులు సతమతమవుతున్నారని అన్నారు. కొందరు గిట్టుబాటు కాక ఇతర వృత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చారు.
చేనేత రంగంపై సమగ్ర సర్వే చేపట్టాలి
చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. వార్పు, సపూరి, జరీ తదితర పట్టు ముడి సరుకులను సబ్సిడీపై సరఫరా చేయాలని, చేనేత రంగంలో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని ఆర్డీవోకు వివరించారు. కార్మికుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి, చేనేత వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించి ముడి సరుకులను సబ్సిడీపై అందించకపోతే చేనేత కార్మికులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏ. ఖాదర్‌బాషా, గుంపు హరి, చేనేత నాయకులు వి. వెంకటస్వామి, సన్నప్పయ్య, శ్రీనివాసులు, అన్నం సూరి, గంగప్ప, బొమ్మ శివప్రసాద్, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.