బిల్డర్లు, డెవలపర్ల సమస్యలకు ప్రత్యేక చర్యలు
భవన అనుమతులు, మంచినీటి కనెక్షన్లపై అవగాహన కల్పించిన జీవీఎంసీ అధికారులు
విశాఖపట్నం, మేజర్ న్యూస్ :
జీవీఎంసీ పరిధిలో బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ అనుమతులు, మంచినీటి కనెక్షన్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్‌రావు తెలిపారు. బిల్డర్లు, డెవలపర్లకు ఎదురవుతున్న సమస్యలు, సందేహాలపై చర్చించేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంచినీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లం రాజుతో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతులు, మంచినీటి సరఫరా కనెక్షన్లు, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలపై బిల్డర్లు, డెవలపర్లతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఆయా సమస్యలకు నిబంధనలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను సూచించినట్లు చెప్పారు.
నీటి కనెక్షన్లపై స్పష్టత
అపార్ట్‌మెంట్లు, భారీ నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన మంచినీటి కనెక్షన్లపై పర్యవేక్షక ఇంజనీర్ పల్లం రాజు వివరించారు. వ్యక్తిగత, అర్ధసమూహ, సమూహ మంచినీటి కనెక్షన్ల మంజూరుకు అమలులో ఉన్న విధివిధానాలు, రుసుములు, నిర్ణీత కాలపరిమితులను వివరించారు. అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల సంఖ్య, వర్తించే నిబంధనలను బట్టి అవసరమైన అర్ధసమూహ లేదా సమూహ నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని బిల్డర్లు, డెవలపర్లకు సూచించారు.
భవన అనుమతుల ప్రక్రియ వేగవంతం
భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన, ప్రణాళికల తనిఖీ, నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాలు, అనుమతుల ప్రక్రియపై ప్రభాకర్‌రావు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా వాటిని నిర్ణీత కాలపరిమితిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవన అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం, పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన బిల్డర్లు
సమావేశంలో బిల్డర్లు, డెవలపర్లు భవన నిర్మాణ అనుమతులు, ఆన్‌లైన్ దరఖాస్తులు, మంచినీటి కనెక్షన్లకు సంబంధించి తమకు ఎదురవుతున్న పలు సమస్యలు, సందేహాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్‌రావు, మంచినీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లం రాజు నిబంధనలకు అనుగుణంగా వివరణలు, సూచనలు అందించారు.
నిర్మాణ రంగానికి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, భవన అనుమతుల ప్రక్రియలో పారదర్శకతను పెంచి సకాలంలో అనుమతులు అందించేలా చర్యలు కొనసాగిస్తామని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు.
సమావేశంలో జీవీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారి ధనుంజయరెడ్డి, డీసీపీలు రామ్మోహన్, వెంకటేశ్వరరావు, మధుసూదన్, మంచినీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ మురళీకృష్ణ, బిల్డర్లు, డెవలపర్లు తదితరులు పాల్గొన్నారు.