బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీది కపట ప్రేమ..
నరసన్నపేట, సూర్య : బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, వైఎస్సార్‌సీపీ న్యాయపరమైన అడ్డంకులు సృష్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలింగ అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణనాయుడు ఆరోపించారు. బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే వైఎస్సార్‌సీపీ రాజకీయ విధానమని విమర్శించారు.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు. 1987లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 1995లో వాటిని 34 శాతానికి పెంచి స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీదేనని తెలిపారు.
ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చట్టపరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. అయితే, ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. బీసీలపై నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని హితవు పలికారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చి ఉంటే స్థానిక సంస్థల్లో సుమారు 16,800 మందికి రాజకీయ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే వైఎస్సార్‌సీపీ, రిజర్వేషన్ల అంశంలో అనుసరిస్తున్న వైఖరి ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, తదుపరి న్యాయపోరాటం విషయంలో తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం మంత్రివర్గ స్థాయిలో సమీక్షించి, న్యాయ నిపుణుల సలహాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి సంబంధించిన అంశంతోపాటు అవసరమైన గణాంక సమాచారాన్ని సమర్పిస్తూ న్యాయపరంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు.
బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీకి ఉన్న నిబద్ధతకు ప్రభుత్వ చర్యలే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా రిజర్వేషన్ల అంశంపై రాజకీయ పార్టీల వైఖరిని గమనించి, బీసీల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని రోణంకి కృష్ణనాయుడు కోరారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.