బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు
అనంతపురం బ్యూరో : బాలికలందరూ విద్యావంతులై, ఆరోగ్యంగా ఎదిగినప్పుడే మహిళా ప్రగతి, సాధికారత సాధ్యమవుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన చైతన్య ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, వంద శాతం అక్షరాస్యత సాధించడం, బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలరని తెలిపారు. బాలికల హక్కుల పరిరక్షణపై సమాజంలో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ అనంతరం మహిళలు, విద్యార్థులు మానవహారంగా ఏర్పడి బాలికల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించాలని, బాలికలను రక్షించాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి ఈ. నాగరాజు, ఆర్ట్స్ కళాశాల మహిళా సాధికారత విభాగం కన్వీనర్ డాక్టర్ బృందా, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు భానుజా, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయభాస్కర్, ఆరోగ్య విస్తరణ అధికారులు ఎల్లప్ప, కిరణ్ కుమార్, శ్రీరాములు, వలి, ఐసీడీఎస్ పర్యవేక్షకులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.