అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన
తణుకు, సూర్య న్యూస్ : తణుకు నియోజకవర్గంలో వైద్య సదుపాయాల విస్తరణ, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ అత్తిలి మండలంలో రూ.15.94 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్తిలి మండల కేంద్రంలో రూ.1.55 కోట్ల వ్యయంతో నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు స్థానికంగానే డయాలసిస్ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఈ కేంద్రం కీలకంగా నిలవనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోగులకు వైద్యసేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.మరోవైపు గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రూ.9.59 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు ,వీటితోపాటు రూ.4.80 కోట్ల విలువైన రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) రహదారుల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ రహదారుల అభివృద్ధితో గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, ప్రజలు విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించేందుకు మరింత సౌలభ్యం కలగనుంది.ఒకే విడతలో వైద్యరంగం, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలకు సంబంధించిన రూ.15.94 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అత్తిలి మండలంలో మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యతను చాటుతోంది. ఈ పనులు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తే మండల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడనున్నాయి.
న్యూస్ బ్యూరోకే బాల సౌరి ఏలూరు