అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి
కర్నూలు, అక్టోబర్ 12: జిల్లాలో గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను అక్టోబర్ 30వ తేదీ లోగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి హౌసింగ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి గృహ నిర్మాణం, టిడ్కో హౌసింగ్, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కొరత, రుణ సదుపాయాలపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం అమలులో పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు లభించే రుణ సదుపాయాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ఇళ్ల నిర్మాణాలకు వారిని ప్రోత్సహించాలన్నారు. PMAY అర్బన్-1, అర్బన్-2 పథకాల పురోగతిని మరింత మెరుగుపరచడంతో పాటు గ్రామీణ గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆదోని పట్టణ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 575 ఇళ్ల నిర్మాణాలను అక్టోబర్ 30వ తేదీలోగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని, ఎంపీడీవోలు తమ సాధారణ విధులతో పాటు గృహ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన వివాదాలు, కోర్టు కేసులు, పట్టా సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా డేటాను సరిచేయాలన్నారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నవారు, అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారులు తదితర వివరాలను పరిశీలించి, సంబంధిత రికార్డుల నుంచి అనవసరమైన నమోదులను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 12 వరకు ఏడు నెలల వ్యవధిలో కేవలం 21 మరుగుదొడ్లు మాత్రమే నిర్మించడం ఏంటని కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారులతో మాట్లాడుతున్నామనే కారణంతో కాలయాపన చేయకుండా, నిర్మాణాలు వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎమ్మిగనూరు పరిధిలో ఇంకా 784 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్న నేపథ్యంలో, వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రతి నెలా ఎన్ని మరుగుదొడ్లు నిర్మిస్తారో స్పష్టమైన ప్రణాళికను రూపొందించి, దాని ప్రకారం పురోగతిని సాధించాలని కలెక్టర్ తెలిపారు.
రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు రైతు రిజిస్ట్రీకి సంబంధించిన పెండింగ్ రికార్డులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ ద్వారా రైతులకు పీఎం కిసాన్, వ్యవసాయ శాఖకు సంబంధించిన పథకాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రయోజనాలు అందుతాయని, కాబట్టి పెండింగ్ రికార్డుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. కోడుమూరు, ఆదోని తదితర మండలాల్లో తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి, రైతు రిజిస్ట్రీకి సంబంధించిన పెండింగ్ రికార్డులన్నింటినీ రేపు సాయంత్రంలోగా పరిష్కరించాలన్నారు. అదే విధంగా ఈ-పంటలో ఈ-కేవైసీ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు.. ఈ-పంట ఈ-కేవైసీ ప్రక్రియను అక్టోబర్ 17వ తేదీ శనివారం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలోని ప్రతి స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించిన స్టాండీలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పించాలన్నారు. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలకు వచ్చే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై అవగాహన కల్పించాలని, సేవలను ఎలా పొందాలో సిబ్బంది వారికి వివరించాలన్నారు.. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్, పీజీఆర్ఎస్ అంశాల్లో పని తీరు మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు...
పాఠశాలల్లో చేపడుతున్న అదనపు తరగతి గదుల (ACR) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అన్ని అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను డిసెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
గోశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను త్వరితగతిన గుర్తించి కేటాయించాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు. ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో గోశాలల నిర్మాణానికి 50 సెంట్ల చొప్పున స్థలాలను గుర్తించాలని, ఆలూరు, కోడుమూరు ప్రాంతాల్లోనూ అవసరమైన స్థలాల గుర్తింపుపై చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని, భూగర్భ జలాల లభ్యత, రహదారి సౌకర్యం, నీటి వసతి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గోశాలల్లో పశువుల పోషణకు అవసరమైన పశుగ్రాసం సాగు చేసుకునేందుకు వీలుగా అదనపు భూమి అందుబాటులో ఉండే ప్రాంతాలను ఎంపిక చేయాలన్నారు.
పిజిఆర్ఎస్ కు సంబంధించి నిర్ణీత గడువులోగా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గడువును దృష్టిలో ఉంచుకుని ముందుగానే అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, క్షేత్రస్థాయి పరిశీలన వంటి ప్రక్రియలను ప్రారంభించాలన్నారు. నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పరిష్కారం అందించి, అనంతరం సంబంధిత వ్యక్తులకు ఎండార్స్‌మెంట్ జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. నిర్ణీత గడువు దాటిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి నరసింహా రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, ఐసిడిఎస్ పిడి విజయ, డి ఆర్ డి ఏ పిడి శ్రీధర్ రావు, జిల్లా స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ అధికారి భాస్కర్ నాయుడు, సిపిఓ భారతి, ఉపాధి కల్పన అధికారి దీప్తి, తదితరులు పాల్గొన్నారు..