ఐ సపోర్ట్ ఏ గ్రీనర్ ఇండియా’ సెల్ఫీ ఫ్రేమ్ ప్రారంభం..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి..
అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు డివిజన్, మండల స్థాయిల్లో సేవా సేతు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి తెలిపారు.సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో గల గోదావరి భవన్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆమె సేవా సేతు అభియాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అదేవిధంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న ‘ఐ సపోర్ట్ ఏ గ్రీనర్ ఇండియా’ సెల్ఫీ ఫ్రేమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 8,844 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిలో 6,323 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు
. సేవా సేతు శిబిరాల ద్వారా గ్రిడ్ అనుసంధానానికి సంబంధించి 19.63MW విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానించబడింది అని వివరించారు.అమలాపురం, కొత్తపేట డివిజన్ల పరిధిలోని బి.ఆర్.ఏ.కె.ఐ.లో సేవా సేతు రిజిస్ట్రేషన్లకు సంబంధించి నిర్దేశించిన 500 రిజిస్ట్రేషన్ల లక్ష్యంలో ఇప్పటివరకు 84 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి తెలిపారు.
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, అర్హులైన కుటుంబాలు పథకంపై అవగాహన పెంపొందించుకుని దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సేవా సేతు శిబిరాల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం అందించి, పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. రాజేశ్వరి, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.