అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీ
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో మహాత్మా గాంధీ చేసిన కృషి, ఆయన త్యాగాలు చిరస్మరణీయమని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి తన్నీరు నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో కూడా గొప్ప విజయాలను సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. సత్యం, అహింస, శాంతి వంటి విలువలను ప్రజలకు మార్గదర్శకంగా అందించిన గాంధీజీ ఆశయాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి వైఎస్ జగన్ పాలన నాంది పలికిందని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటాన్ని, ఆయన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.