స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన
స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన
• స్వచ్ఛ మారథాన్‌ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్వచ్ఛoధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి
• 22 రాష్ట్రాల నుంచి 10 వేల మంది పాల్గొనడం విజయవాడకు గర్వకారణం
విజయవాడ, అక్టోబర్ 2, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : పరిశుభ్రమైన విజయవాడ, ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛ మారథాన్‌ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. 5కే, 10కే రన్‌లలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి సుమారు 10 వేల మంది పాల్గొనడం పట్ల ఎంపీ చిన్ని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జుంబా నృత్యంలో పాల్గొని యువతలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. విజయవాడ అంటేనే ప్రత్యేకమైన వైబ్రేషన్ అని, ఈ నగరంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ విజయవాడను గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. విజయవాడకు స్వచ్ఛత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ మారథాన్ కేవలం ఒక రన్ మాత్రమే కాదని, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం, సమాజంలో భాగస్వామ్య భావన పెంపొందించే కార్యక్రమమని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు.గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛ మారథాన్‌కు వచ్చిన స్పందనతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ఏడాది 22 రాష్ట్రాల నుంచి 10 వేల మంది పాల్గొనడం విజయవాడకు లభించిన ప్రత్యేక గౌరవంగా పేర్కొన్నారు. విజయవాడను స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. నగర పరిశుభ్రత కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.స్వచ్ఛ మారథాన్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, అధికారులు, సిబ్బంది, నిర్వాహకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎంపీ చిన్ని కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ఉత్సవ్–2.0ను కూడా నగర ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ ఫార్మా కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా నగర వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేందుకు విజయవాడ ఉత్సవ్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు.మారథాన్‌తో పాటు నగరంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ప్రజలు భద్రతా నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎంపీ చిన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, బొండా సిద్దార్ధ,స్వచంధ్రా ఎండి సునీల్ కుమార్ రెడ్డి, వి ఎమ్ సి కమిషనర్ ధ్యాన్ చంద్, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, హెచ్డీఎఫ్సి స్టేట్ హెడ్ పవన్, తదితరులు పాల్గొన్నారు