అగ్రీప్రెన్యూర్‌షిప్, ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక దృష్టి
జిల్లా సామర్థ్యాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధికి అడుగులు..
ప్రణాళిక రూపకల్పన సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, మేజర్ న్యూస్ : అమరావతి ఆర్థిక ప్రాంతంలో ఎన్‌టీఆర్ జిల్లా కీలకపాత్ర పోషించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళిక రూపకల్పన సమావేశంలో జిల్లాలోని ఆర్థిక సామర్థ్యాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల అభివృద్ధిపై చర్చించారు. హైటెక్ వ్యవసాయం, ప్రకృతి సేద్యం, ఆహార శుద్ధి పరిశ్రమలు, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 2024-25 తొలి సవరించిన అంచనాల ప్రకారం జిల్లాలో వ్యవసాయ రంగం వాటా 12 శాతం, పారిశ్రామిక రంగం 21 శాతం, సేవా రంగం 67 శాతంగా ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే 40 వేల మందికి పైగా ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారని, ఏడు నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టుబడిదారుల సహాయ కేంద్రం, భూ బ్యాంకు వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలని, భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, స్థానిక వనరుల సమర్థ వినియోగంతో సుస్థిర, సమగ్ర ఆర్థిక వృద్ధికి బాటలు వేయాలని, తద్వారా అమరావతి ఆర్థిక ప్రాంతంలో ఎన్‌టీఆర్ జిల్లాను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.