అధిక వర్షాల వేళ పత్తి పంట సంరక్షణపై ర చర్యలు
*మండల వ్యవసాయ అధికారి శ్రీలక్ష్మి
నెల్లిమర్ల, సెప్టెంబర్ 30;
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు పంటను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సతివాడ వ్యవసాయ అధికారి పి. శ్రీలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె డి.ఏ.ఏ.టి. శాస్త్రవేత్తలతో కలిసి సతివాడ గ్రామంలోని పత్తి పంటలను పరిశీలించి, పలు కీలక సూచనలు చేశారు.
పొలంలో వర్షపు నీరు నిలవకుండా తక్షణమే బయటకు పంపాలి. ప్రతి పది వరుసలకి ఒక లోతైన కాల్వను ఏర్పాటు చేసి నీటి పారుదల కల్పించాలి. మొక్క మొదళ్ళు, ఆకులు, కాయలు బాగా తడిచేలా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పంటకు అదనంగా 30 కిలోల యూరియా మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పైపాటుగా అందించాలి. లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ మరియు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి, ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేయాలి.
ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు వర్షాలు తగ్గాక 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 మి.లీ. ప్రొపికోనజోల్ లేదా 2 మి.లీ. కాప్తాన్ + హెక్సాకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వర్షాలు తగ్గిన తర్వాత పిండినల్లి ఉధృతిని అరికట్టడానికి లీటరు నీటికి 2 మి.లీ. ప్రొపినోఫాస్ మందును వాడాలి.
గులాబి రంగు పురుగు ఉంటే లీటరు నీటికి 2 మి.లీ. ప్రొపినోఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ కలిపి పిచికారి చేయాలి.
వర్షాలు తగ్గిన 3-4 రోజుల తర్వాత వరుసల మధ్య భాగంలో గుంటకతో లేదా గొప్పు ద్వారా తేమ ఆరిన తరువాత సేద్యం చేయాలి.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.