ఆత్మకూరు స్థానిక పాలకుల్లో మహిళలకే అగ్ర తాంబూలం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు నియోజకవర్గంలోని స్థానిక సంస్థల పాలకుల్లో మహిళలకే పెద్ద పీట లభించింది. నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ, ఆరు మండలాలు ఉండగా మున్సిపల్ చైర్మన్, ఆరు మండలాల మండలాధ్యక్షులు, జెడ్పిటిసి మెంబర్లు పదవులు 13కాగా 10మంది మహిళలే ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం తరపున డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా విజయం సాధించారు.ఆరు మండలాల ఎంపీపీ ఎన్నికల రిజర్వేషన్ లలో ఐదు స్థానాలు మహిళలకే కేటాయించడంతో మహిళలే అగ్రస్థానంలో నిలవడం విశేషం.ఆరు మండలాలలో కలిపి చేజర్ల మండలం మాత్రమే ఎంపీపీ మగవారికి కేటాయించబడింది.. మిగిలిన ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, ఏఎస్ పేట, అనంతసాగరం మండలంలో ఎంపీపీ స్థానాలు మహిళలకే కేటాయించబడ్డాయి.. దీంతో నియోజకవర్గంలో మగవారికి ఒకే ఒక్క మండలం (చేజర్ల) మాత్రమే కేటాయించబడింది. ఆత్మకూరు ఎంపిపి గా దావా సుమన్య, అనంతసాగరం ఎంపిపిగా కిన్నెర రమాదేవి, ఏ ఎస్ పేట ఎంపిపి గా అబ్బూరి శ్రీవాణి, మర్రిపాడు ఎంపిపిగా పుట్టం విజయనిర్మలా రెడ్డి, సంగం ఎంపిపి గా గుండ్లపల్లి మమత, చేజర్ల ఎంపిపిగా డొంకల నరసింహ రావు లు ఎన్నికయ్యారు. జెడ్పిటిసి సభ్యులుగా అనంతసాగరం నుండి మెట్టుకూరు శిరీష, ఏ ఎస్ పేట నుండి నంది ప్రభావతి, మర్రిపాడు నుండి గంగినేని ప్రసన్న, చేజర్ల నుండి రావి మల్లేశ్వరి, ఆత్మకూరు నుండి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, సంగం నుండి కర్ణాటి రవీంద్రా రెడ్డి విజయం సాధించారు. ఆత్మకూరు నియోజకవర్గం లోని మున్సిపాలిటీ,ఎంపీపీ, జెడ్పిటిసి స్థానాలకు మహిళా అధిక్యత చోటు చేసుకుంది. మొత్తం మీద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ప్రతినిధ్యం వహించే ఆత్మకూరు నియోజకవర్గం లో 13కు 10మంది మహిళలు స్థానిక పాలకులు ఎన్నిక కావడం విశేషం.