ఆర్నబ్ తుఫాను విద్యుత్ పునరుద్ధరణ పనులకు నెల్లూరు జిల్లా నుంచి 220 మంది విద్యుత్ సిబ్బంది
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఆర్నబ్ తుఫాను కారణంగా విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను తొలగించి, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి , ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నుంచి 220 మంది విద్యుత్ సిబ్బందిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి పంపించడం జరిగింది. ఒక్కో బృందంలో 10 మంది చొప్పున మొత్తం 22 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సహాయక చర్యల నిమిత్తం పంపించారు. వీరితో పాటు విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు 11 డ్రిల్లింగ్ మిషన్లను కూడా తరలించడం జరిగింది. నెల్లూరు జిల్లా నుంచి వెళ్లిన విద్యుత్ సిబ్బంది అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ లైన్ల మరమ్మతులు, దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ తదితర సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ పనులను సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతంగా జరిగేలా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు అక్కడే ఉండి సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు అందిస్తూ, పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ పి. సుధాకర్ గారు మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరణ సహాయక చర్యల్లో నెల్లూరు జిల్లా విద్యుత్ సిబ్బంది ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. విపత్తుల సమయంలో ఇతర జిల్లాల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బందిని, అవసరమైన యంత్ర పరికరాలను పంపించి సహకారం అందించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడం విద్యుత్ శాఖ ప్రధాన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.