రంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం కోశాధికారిగా దేదీప్య రేవతి ఏకగ్రీవ ఎన్నిక
జిల్లా కార్యవర్గంలో పలువురికి కొత్త బాధ్యతలు.. ఉద్యోగుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయం
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) రంగారెడ్డి జిల్లా కోశాధికారిగా దేదీప్య రేవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొంగరకలాన్‌లోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లో బుధవారం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి నేతృత్వంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సంఘం సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, సభ్యత్వ రసీదులను వెంటనే సంఘానికి సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే, రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల హౌసింగ్ సొసైటీలో జిల్లా అధికారులను సభ్యులుగా చేర్పించేందుకు త్వరితగతిన దరఖాస్తులు సమర్పించాలని నిర్ణయించారు. 2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ, క్యాలెండర్ ప్రచురణ కోసం ప్రకటనలను వీలైనంత త్వరగా సేకరించాలని తీర్మానించారు. వచ్చే నెలలో జిల్లా టీజీఓ సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
జిల్లా కార్యవర్గంలో కొందరు సభ్యులు పదవీ విరమణ చేయడం, మరికొందరు ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా కోశాధికారిగా దేదీప్య రేవతి, వైస్ ప్రెసిడెంట్లుగా రాకేష్, ఎం. శ్రీనివాస్, మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా సైదమ్మ, జాయింట్ సెక్రటరీలుగా మహేశ్వర్, ఎన్. సూర్య, కల్చరల్ సెక్రటరీగా వి. జ్యోత్స్న, ఆఫీస్ సెక్రటరీగా విక్టోరియా రాణి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా డాక్టర్ దీప్తి ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ నూతనకంటి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, జాయింట్ సెక్రటరీ శాంతిశ్రీతో పాటు నాగేశ్వర్ రావు, రాకేష్, అనిత, జ్యోత్స్న, శ్రీనివాస్, మహేష్, విక్టోరియా రాణి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం సంఘం నాయకులు, సభ్యులు ఐక్యంగా, సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.