ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు
గాజువాక, సూర్య : విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్)లో 2026 సంవత్సరానికి గాను 'విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్' లాంఛనంగా ప్రారంభమైంది. పరిపాలనా భవనం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదురుగా సోమవారం ఉదయం 11 గంటలకు ఉద్యోగుల చేత 'సమగ్రతా ప్రతిజ్ఞ' చేయించి ఈ వారోత్సవాలను ప్రారంభించారు. సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక ప్రవర్తనను సమర్థవంతంగా అమలు చేస్తూ విధులను నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అందరికీ సులభంగా అర్థమయ్యేలా, ఎక్కువ మంది పాల్గొనేలా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ ప్రతిజ్ఞను నిర్వహించారు. ఆర్ఐఎన్ఎల్ పరిధిలోని పలు కార్యాలయాలతో పాటు ప్లాంట్లోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో భాగస్వాములయ్యారు. ఈ ఏడాది విజిలెన్స్ వారోత్సవాల కోసం 'ప్రోబిటీ ఫర్ ప్రాస్పరిటీ' అనే థీమ్‌ను ఎంచుకున్నారు. సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడంలో, దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడటంలో నిజాయితీ, నైతిక పాలనలు కీలక పాత్ర పోషిస్తాయని యాజమాన్యం పేర్కొంది. ఈ వారోత్సవాల ద్వారా సంస్థలోని అన్ని స్థాయిల్లో నైతిక పద్ధతులను ప్రోత్సహిస్తూ, పారదర్శకతను మరింత బలోపేతం చేస్తామని ఆర్ఐఎన్ఎల్ స్పష్టం చేసింది.
రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.