80 అడుగుల రోడ్డా నీవు ఎక్కడ..? అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇక్కట్లు
నరసన్నపేట, సూర్య : నరసన్నపేట పట్టణ ప్రధాన రహదారి 80 అడుగుల విస్తీర్ణం ఎక్కడుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విస్తరణ ఫలితాలు ఎవరు పొందుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వ్యాపార కార్యకలాపాలకు వేదికగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపైకి చొచ్చుకొచ్చిన తోపుడుబళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, పండ్ల దుకాణాలతో పాటు అడ్డదిడ్డంగా నిలిపే ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాల కారణంగా ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రహదారిలో సగం మేర కూడా వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు.
పెరుగుతున్న జనాభా, పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రధాన రహదారిని 80 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేసి, ఇరువైపులా మురుగు కాలువలను నిర్మించారు. అయితే ప్రస్తుతం రహదారి ఆక్రమణలకు గురవుతుండటంతో విస్తరణ లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కాలువలు ఆక్రమణలకు గురికావడం, నిర్వహణ లోపించడం వల్ల మురుగునీరు సక్రమంగా ప్రవహించక పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ నియంత్రణ ఏది?
రహదారిపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేయడం వల్ల పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నో-పార్కింగ్ నిబంధనల అమలుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. రహదారిపై వ్యాపారాల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు అమలు చేయకపోవడం వల్లే సమస్యలు కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల తీరుపై ఆరోపణలు
రహదారులను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న కొందరి నుంచి అధికారులు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నామని, అదనంగా కొంత మొత్తం మామూళ్ల రూపంలో ఇస్తున్నామని కొందరు వ్యాపారులు బహిరంగంగా చెబుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.
ప్రజలకు ఇబ్బందులు తొలగేదెప్పుడు?
రోడ్డు విస్తరణతో మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతాయని ఆశించిన పట్టణ ప్రజలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు నిరాశ కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో ప్రధాన రహదారిపై ఆక్రమణలను గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మురుగు కాలువలను పునరుద్ధరించి, క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.