50 ఏళ్ల గర్భకండ్రిక భూ వివాదానికి తెర.
1,301 మంది రైతులకు పట్టాల భరోసా!
కొండపిలో 8 గ్రామాల రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
2,915.10 ఎకరాల భూ సమస్యకు పరిష్కార మార్గం
1959 నాటి ఫారం-2 రికార్డుల ఆధారంగా భూముల పరిశీలన
వెబ్‌ల్యాండ్ రికార్డుల సవరణకు అక్కడికక్కడే ఆదేశాలు
పట్టాలతో రైతులకు భూ హక్కులు.. రుణాలు, పంటల బీమాకు మార్గం సుగమం
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
ఐదు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ భూములపై చట్టబద్ధ హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట కల్పించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో ఎనిమిది గ్రామాలకు చెందిన 1,301 మంది రైతులకు సంబంధించి 2,915.10 ఎకరాల భూముల సమస్య పరిష్కారానికి మార్గం చూపారు. అర్హులైన రైతులకు రైత్వారీ పట్టాలు జారీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
రైతుల సమస్యలను స్వయంగా విన్న సీఎం
కొండపి నియోజకవర్గం నర్సింగోలు గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గర్భకండ్రిక భూముల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తరతరాలుగా భూములను సాగు చేస్తున్నప్పటికీ హక్కుల గుర్తింపు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ రుణాలు, పంటల బీమా, ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు గర్భకండ్రిక భూముల సమస్యకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమస్య స్వరూపం, భూముల విస్తీర్ణం, గ్రామాల వారీగా రైతుల సంఖ్య, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులపై అధికారులు వివరాలు సమర్పించారు. రైతుల సమస్యను పరిశీలించిన ముఖ్యమంత్రి, భూములపై హక్కుల గుర్తింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
1959 రికార్డుల ఆధారంగా భూముల పరిశీలన
గర్భకండ్రిక భూముల సమస్య పరిష్కారంలో భాగంగా చారిత్రక రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా 1959 నాటి ఫారం-2 రికార్డులను ఆధారంగా తీసుకుని భూముల వివరాలు, సాగులో ఉన్న రైతుల హక్కులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఇనాం భూములకు సంబంధించిన సమస్యను చట్టబద్ధ ప్రక్రియ ద్వారా పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని సీఎం సూచించారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో అవసరమైన సవరణలు చేపట్టేందుకు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
నాలుగు మండలాల్లో 1,301 మంది రైతులకు ప్రయోజనం
ప్రభుత్వ నిర్ణయంతో ప్రకాశం జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులకు ప్రయోజనం కలగనుంది. గ్రామాల వారీగా రైతులు, భూముల వివరాలు ఇలా ఉన్నాయి.నర్సింగోలు: 209 మంది రైతులకు 400.24 ఎకరాల భూములకు పట్టాల జారీ.కొండపి మండలం: ఇలవర, వెన్నూరు గ్రామాల్లో 281 మంది రైతులకు 1,003 ఎకరాలకు హక్కుల కల్పన.జరుగుమిల్లి మండలం: పచ్చవ, వర్దినేనిపాలెం, నర్సింగోలు, కె. బిట్రగుంట గ్రామాల్లో 569 మంది రైతులకు 1,260 ఎకరాలకు పట్టాల జారీ.నాగులుప్పలపాడు మండలం: ఓబన్నపాలెంలో 430 మంది రైతులకు 567 ఎకరాలకు పట్టాల పంపిణీ.సింగరాయకొండ మండలం: కలికివాయలో 21 మంది రైతులకు 62 ఎకరాలకు పట్టాల పంపిణీ.
పట్టాలతో రైతులకు ఆర్థిక భద్రత
భూములపై చట్టబద్ధ హక్కులు గుర్తింపు పొందడంతో రైతులకు పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి. పట్టాల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ రుణాల పొందడం వంటి ప్రక్రియల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. పంటల బీమా, ప్రభుత్వ సబ్సిడీలు, వ్యవసాయ సంబంధిత పథకాల ప్రయోజనాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది. భూములపై హక్కులు స్పష్టమవడం వల్ల రైతులతో పాటు వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత లభించనుంది.
దశాబ్దాల నిరీక్షణకు పరిష్కారం దిశగా అడుగులు
ఏళ్ల తరబడి భూముల హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. గర్భకండ్రిక భూములకు పట్టాలు జారీ చేసేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.