29 న పంచాయతీ పోరు... ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక!
ఎస్ రాయవరం మండలంలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై కూటమి సమావేశం
ఎస్.రాయవరం, నవంబర్ 13, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలంలో ఈనెల 29వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మండల తెలుగుదేశం పార్టీ శుక్రవారం వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ఎస్.రాయవరం మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం అధ్యక్షతన కూటమి నేతలతో సహా ముఖ్య నేతల సమావేశం వెంకటాపురంలో జరిగింది.
సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు:
ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక చేయాలి... ప్రతి గ్రామంలోనూ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూర్చొని సర్పంచ్ అభ్యర్థులను ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలని నిర్ణయించారు. గ్రూపు విభేదాలకు తావులేకుండా చూడాలని సూచించారు. అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీపీ అభ్యర్థి నల్లపరాజు వెంకటరాజు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధిని వివరించి ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వినోద్ రాజు, మండల నాయకులు బొలిశెట్టి గోవిందరావు, గుర్రం రామకృష్ణ, తుమ్మపాల నాగేశ్వరరావు, ఎంపీటీసీ వజ్రపు శంకరరావు, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పిన శ్రీనివాసరావు, రావి రమణ బాబు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పప్పల శివ, అరవింద్, ముప్పిన రాజు, వీసం సాయి తో పాటు మండలంలోని వివిధ గ్రామాల కూటమి ముఖ్య నేతలు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.