|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:45 PM
కాంగ్రెస్ పార్టీ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బాంబ్ పేలుస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో సారా దుకాణాలను మళ్లీ తెరవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను కోరతానని వెల్లడించారు. సారా ఆరోగ్యానికి హానికరం కాదని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఎందుకు సారా దుకాణాలను మూసివేశారో తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో సారా తాగిన వారు 115 ఏళ్ల పాటు బతికే వారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు చాలా మంది మద్యం తాగి 80 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. అందుకే తెలంగాణలో సారా దుకాణాలను తిరిగి ప్రారంభించాలని తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు. సారా ఆరోగ్యానికి హానికరం కాదని శాస్త్రీయ పద్దతులు చెబుతున్నాయని పేర్కొన్న జడ్చర్ల ఎమ్మెల్యే .. అసలు తెలంగాణ రాష్ట్రంలో సారా దుకాణాలు ఎందుకు బంద్ చేశారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
త్వరలో నిర్వహించనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‍లో సారా దుకాణాలను తిరిగి ప్రవేశపెట్టాలనే అంశాన్ని లేవనెత్తుతానని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలె దేశంలోని కొన్ని రాష్టాలు మళ్లీ సారా దుకాణాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒడిశా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలను నడుపుతున్నాయని వెల్లడించారు.