|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 08:43 PM
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు అందుబాటులో రానుంది. మామునూరు విమానాశ్రయం నిర్మాణంపైనా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా అయోధ్యపురం వద్ద రూ.521 కోట్లతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) నిర్మిస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. మామునూరు విమానాశ్రయం నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేసి.. విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయానికి అవసరమైన 280 ఎకరాల భూసేకరణ చేసి అప్పగించినందున.. ఇక నుంచి పనులు మరింత వేగంగా సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభంలో చిన్న విమానాలను నడుపుతామని, ప్రజల నుంచి వచ్చే స్పందన, ప్రయాణికుల రద్దీని బట్టి భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా సర్వీసులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి కీలక మౌలిక వసతి ప్రాజెక్టుగా నిలవనున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. అత్యాధునికంగా నిర్మిస్తున్న ఈ ఆర్‌ఎంయూ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌ఎంయూ నిర్మాణం రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయబోతోందన్నారు. 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనికి శంకుస్థాపన చేయగా.. కేవలం మూడేళ్లలోనే ప్రధాన షెడ్‌తో సహా ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాదిలోనే ఈ ఫ్యాక్టరీలో పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ యూనిట్‌లో ప్రాథమికంగా 16 కోచ్‌ల మెమూ ర్యాక్‌లను తయారు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో దేశీయ రైల్వే అవసరాలకు అనుగుణంగా అనేక రకాల ఆధునిక కోచ్‌లను కూడా ఇక్కడే తయారుచేస్తామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో తయారీ రంగం బలోపేతం అవుతుందని స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక పత్తి దిగుబడి ఎంత వచ్చినా.. రైతులు పండించిన పంట మొత్తాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికోసం వ్యవసాయ శాఖ అధికారి నుంచి ఎంత దిగుబడి వచ్చిందనే అంశంపై లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, తేమ శాతం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జాతరలకు జాతీయ హోదా కల్పించడం దేశవ్యాప్తంగా ఎక్కడా అమలులో లేదని అయినప్పటికీ మేడారం జాతర నిర్వహణ కోసం అవసరమైతే నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.