వాణి పాఠశాల ఆటస్థలంపై కబ్జా ఆరోపణలు! జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ సురేందర్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు.. అధికారులు ఏం చేస్తున్నారు?
హైదరాబాద్ మేజర్ న్యూస్ :: ఓల్డ్ మలక్‌పేట్ ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత వహించాల్సిన అధికారుల పర్యవేక్షణలోనే ప్రభుత్వ పాఠశాల ఆటస్థలానికి రక్షణ లేకుండా పోయిందా? ఓల్డ్ మలక్‌పేట్ ఎంసీహెచ్ కాలనీలోని వాణి అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆటస్థలాన్ని మలక్‌పేట్ జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ సురేందర్ సింగ్ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య ఆరోపించారు. విద్యార్థులు ఆటలాడుకునే మైదానానికే ముప్పు ఏర్పడటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రిన్సిపాల్ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 1968లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్న ఈ పాఠశాలకు సంబంధించిన ఆటస్థలాన్ని దసరా సెలవుల సమయంలో ఆక్రమించినట్లు ఆయన ఆరోపించారు. ఈ నెల 10వ తేదీ నుంచి పాఠశాలకు సెలవులు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, అర్ధరాత్రి సమయంలో ఆటస్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని, విద్యుత్ సరఫరా కూడా తీసుకున్నారని పేర్కొన్నారు.
పిల్లల ఆటస్థలాన్నే వదలరా?
ఈ ఘటనపై ఓల్డ్ మలక్‌పేట్ బీఆర్‌ఎస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ పాకెట్ల నర్సింగ్ విలేకరుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. సుమారు 58 ఏళ్ల చరిత్ర కలిగిన వాణి అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆటస్థలాన్ని ఆక్రమిస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కుమ్మక్కై ఆటస్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల ఆస్తులను, విద్యార్థుల ఆటస్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా? ఇలాంటి ఘటనలు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అధికారులు వెంటనే స్పందించాలి
వాణి పాఠశాల ఆటస్థలానికి సంబంధించిన భూమి రికార్డులను పరిశీలించి, ఆక్రమణ ఆరోపణలపై తక్షణమే విచారణ చేపట్టాలని పాకెట్ల నర్సింగ్ సంబంధిత అధికారులను కోరారు. పాఠశాల ఆటస్థలాన్ని పరిరక్షించి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి, వాస్తవాలను వెలికితీసి పాఠశాల ఆటస్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.