ఉస్మాన్ నగర్‌లో విచ్చలవిడిగా అక్రమ షెడ్ల నిర్మాణాలు!
రామచంద్రపురం;రామచంద్రాపురం మండల పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో అక్రమ షెడ్ల నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేస్తూ వాటిలో వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాళీ స్థలాలను ఆక్రమిస్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఒకవైపు పట్టణ ప్రణాళిక, అనుమతుల విషయంలో నిబంధనలు అమలులో ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా వాటిని అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అక్రమ నిర్మాణదారులకు ఎవరి అండదండలు ఉన్నాయనే ప్రశ్నలు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇప్పటికైనా సీఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించాలని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తారా? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తారా? అన్నది వేచి చూడాలి.