శిల్పారామంలో కర్ణాటక సంగీతం, భరతనాట్యంతో అలరించిన కళాకారులు
మాదాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్‌లోని శిల్పారామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళా సిబ్బంది సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం సందర్శకులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి పండుగ సందడిని మరింత పెంచారు.ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి విచ్చేసిన దీపిక బృందం నిర్వహించిన కర్ణాటక సంగీత కచేరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
గణపతి తాళం, అఖిల లోక పావని, శ్రీ లలిత, నవదుర్గ, తీరు తీరు జవరాల తదితర కీర్తనలను ఆలపించి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు.అదేవిధంగా వర్ణ డాన్స్ అకాడమీ నాట్య గురువులు స్మిత, మాధవ్, భార్గవి ఆధ్వర్యంలో శిష్య బృందం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అమృత, కుమారి ఇషా, యశస్విని, గీత హన్సిక, గీన కమాలిక, సహన, రిషిక తదితరులు మాంటెక్, జతిస్వరం, శారదే, క్షీరాభి కన్యక, అష్టలక్ష్మి తదితర అంశాలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మరోవైపు, శిల్పారామంలో నిర్వహిస్తున్న ట్రైబల్ మేళాలో ఆదివాసీ కళాకారులు, ఉత్పత్తిదారులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యం, గిరిజన ఉత్పత్తులతో శిల్పారామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.