షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్
హైదరాబాద్, మేజర్ న్యూస్; అమెరికాలోని *షార్లెట్* లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, ఫ్రీస్టైల్ డ్యాన్స్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. సైన్స్ ఫెస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉండగా, తెలుగు సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాల విస్తరణ, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) మిషిగన్ చాప్టర్‌ను ఫార్మింగ్టన్ హిల్స్‌లో ప్రారంభించారు. చాప్టర్ కోఆర్డినేటర్‌గా శ్రీదేవి మణేపల్లి, జాయింట్ కోఆర్డినేటర్‌గా మహి బొల్లవరం నియమితులయ్యారు.
రవి చాలంటి ఈవెంట్స్, లాజిస్టిక్స్ బాధ్యతలు, హేమ సూరపరాజు ట్రెజరర్‌గా, జ్యోతి జవ్వాది సభ్యత్వ బాధ్యతలు, అనుపమ దివాకర్ల పబ్లిక్ రిలేషన్స్, మీడియా బాధ్యతలు చేపట్టనున్నారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల సంస్థ హెల్ప్‌లైన్ సేవలను, అవసరంలో ఉన్న తెలుగు వారికి అందిస్తున్న సహాయాన్ని వివరించారు.
అధ్యక్షుడు రాజ్ అల్లాడా సమాజ సేవకు నాట్స్ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మనోరమ గాంధీ, కూచిపూడి కళా ప్రోత్సాహకురాలు సంధ్య ఆత్మకూరి, తెలుగు భాషా కార్యక్రమం మనబడి, సామాజిక సేవకుడు సన్నీ రెడ్డి, వైద్య, సినీ రంగాల్లో సేవలందిస్తున్న డాక్టర్ హరినాథ్ పోలిచెర్లను సత్కరించారు. స్థానిక విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆప్టా, డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్, డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.