*సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు ప్రజాప్రతినిధుల సమీక్ష*
నారాయణఖేడ్;ఈ నెల 19వ తేదీన సిద్దిపేట నియోజకవర్గంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలు సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరియు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి టీజీఐఐసీ ఛైర్మెన్ నిర్మల జగ్గారెడ్డి శనివారం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని, అలాగే మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా సభా వేదిక ఏర్పాటు, ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్, సభకు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే ప్రజల కోసం జన సమీకరణ, రవాణా మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు మరియు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సభా ప్రాంగణాన్ని నేతలు స్వయంగా పరిశీలించి, ఏర్పాట్లు సజావుగా సాగేలా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.