సర్ ప్రక్రియలో ఓటర్ల సమస్యలను పరిష్కరించాలి అధికారులకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ విజ్ఞప్తి
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన SIR సమీక్షా సమావేశంలో మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వారి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ఓటర్లకు నోటీసులు అందకపోవడం, చిరునామాలు,పేర్లు, వయస్సు వివరాల్లో తప్పులు, మరణించిన వారి పేర్లు జాబితాలో కొనసాగడం, అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అర్హులైన కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6పై అవగాహన కల్పించాలని, ఓటర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఉప్పలపాటి శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.