రేవంత్ రెడ్డి పర్యటనతో హరీష్ రావు రాజకీయాలకు చెక్! టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హరీష్ రావు రాజకీయాలు సాగవని, ఇకపై బావా బామ్మర్దుల ఆటలు తెలంగాణలో చెల్లవని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనకు వచ్చిన తర్వాత హరీష్ రావు రాజకీయాలకు తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట గడ్డపై నుంచే హరీష్ రావు అవినీతిని తెలంగాణ ప్రజలకు సీఎం వివరించబోతున్నారని అన్నారు.
గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎజెండాను పక్కనపెట్టి తన సొంత రాజకీయ ఎజెండాతో తిరుగుతున్నారని ఆరోపించారు. గత ఆరు నెలలుగా కేసీఆర్ హరీష్ రావుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. బావా బామ్మర్దులు తమ ఆధిపత్యం కోసం రైతు గర్జన పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గతంలో రైతుల కష్టాలను పట్టించుకోని వారు ఇప్పుడు రైతుల వేషంలో తిరుగుతూ మరోసారి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా గతంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాన్ని కేటీఆర్ చూపించగలరా అని దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు మరణించిన సమయంలో కేటీఆర్ చెన్నై వెళ్లారని ఆరోపిస్తూ, ఉద్యమకారులను అక్కున చేర్చుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు. త్వరలో తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మైక్ కట్ అయ్యే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతిని బీజేపీ కాపాడుతోందని, ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, రైతుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలని చనగాని దయాకర్ హెచ్చరించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.