బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమం
కావలి, మేజర్ న్యూస్ : జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న బ్రిక్స్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు " వ్యర్థంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ పరికరాలు: పర్యావరణ ప్రభావం " అనే అంశం మీద వృక్షశాస్త్ర శాఖాధిపతి శ్రీమతి వి. వసుంధరాదేవి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేడు కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలు తర్వాత రెండు సంవత్సరాలకి కాలం చెల్లడంతో అవి నిరుపయోగంగా మారిపోతున్నాయి. సమాచార సాంకేతిక రంగాలలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల రీత్యా మానవుని అవసరాలు, ప్రాధాన్యతలు రోజురోజుకీ క్రమక్రమంగా మారిపోవడంతో ఎలక్ట్రానిక్స్ పరికరాలు త్వరితగతిన కాలం చెల్లిపోతున్నాయి. దీనివల్ల నిరుపయోగంగా మారి పోతున్నాయి. పాత కంప్యూటర్లు, లాప్టాప్స్, మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, కీబోర్డలు, టెలిఫోన్లు, టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రో ఓవెన్లు, వాషింగ్ మెషిన్లు, మొదలగు ఎలక్ట్రానిక్స్ వ్యర్ధాలు కళాశాలల్లో, కార్యాలయాలల్లో, గృహాలలో, వివిధ కంపెనీలలో ఇబ్బడి ముబ్బడిగా పేరుకు పోతున్నాయి. వీటి మూలంగా వేస్ట్ మేనేజ్ మెంట్, కాలుష్య సమస్య, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ప్రభావంతో సీసం, కాడ్మియం, పాదరసం మొదలగు విషపూరిత రసాయనాలు గాలిలో కలిసి, మట్టిలోకి ఇంకి, భూగర్భంలోకి చేరి తాగు నీరు, గాలి కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. వీటికి నివారణగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల పునర్వినియోగ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావలెనని తద్వారా ఎలక్ట్రానిక్స్ వ్యర్ధాలు రీసైకిల్ కి పోయి మరలా కొత్త వస్తువులుగా రూపొంది వినియోగంలోకి రావడం వలన పర్యావరణ నష్టం లేని విధంగా ఉంటుందని రెమిడీని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.నాగేశ్వరరావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.