రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి/కొడంగల్, మేజర్ న్యూస్: దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం కొడంగల్ నియోజకవర్గానికి రానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేయగా, పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది.పర్యటన ప్రశాంతంగా, సజావుగా జరిగేలా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్, కొడంగల్‌లోని హెలిప్యాడ్‌తో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ…, హెలిప్యాడ్, పర్యటన మార్గాలు, ఇతర కీలక ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ…, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సిబ్బందితో రెండు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్, మున్సిపల్, ఆహార భద్రత, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.అనంతరం కొడంగల్‌లోని బాసిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో పోలీస్ సిబ్బందికి ఎస్పీ స్నేహ మెహ్రా ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా విధులు, సిబ్బంది బాధ్యతలు, అప్రమత్తత, సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ శ్రీనివాస్, పోలీస్ శాఖకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌అండ్‌బీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలను కలవనుండటంతో కొడంగల్‌లో పర్యటనపై ఆసక్తి నెలకొంది.