రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న చలో ఆర్డీవో కార్యాలయం
రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న చలో ఆర్డీవో కార్యాలయం
**బీజేపీ నాయకులు బొక్క నరసింహారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్
కందుకూరు,మేజర్ న్యూస్ (అక్టోబర్ 28): రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన చలో ఆర్డీవో కార్యాలయం కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ సంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు, మెదక్ జిల్లా ఇన్‌చార్జి బొక్క నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రకృతి వైపరీత్యాలతో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల రైతుబంధు సాయాన్ని సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలోని అన్ని పంటలకు వర్తింపజేయాలని కోరారు.అదేవిధంగా రైతుల పట్టా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం 12 గంటలు కూడా సరఫరా చేయడం లేదని వారు ఆరోపించారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల రైతు సంఘం నాయకులు, రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బ్యాంకు డైరెక్టర్లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వాల్‌పోస్టర్ విడుదల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పల్లె కృష్ణ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి, సీనియర్ నాయకుడు అంబర్ యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి గౌర ప్రభాకర్, సర్పంచులు బూర దిలీప్ గౌడ్, ఊటు మహేందర్, నరేష్, రమేష్, సామల దయాకర్ రెడ్డి, నవీన్, మాసన్నగారి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
----------------------------------------
కేకేఆర్ 2806: వాల్ పోస్టర్ను విడుదల చేస్తున్న బిజెపి నాయకులు
=====================