రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!.
సోమాజిగూడ/మేజర్ న్యూస్:1 రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొందని మాజీ కార్పొరేటర్ , బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మహేష్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. స్థానిక సమస్యల పై చర్చించేందుకు స్థానిక పార్టీ నాయకులతో పార్టీ కార్యాలయం లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రావణాసుర పాలనకు చరమగీతం పాడే రోజు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో మా గెలుపు ఖాయం
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ విజయం నల్లేరు మీద నడకేనని మహేష్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం దానం నాగేందర్ ఇప్పటివరకు ప్రజల మధ్యకు రావడం లేదని, నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఎన్నికల్లో దానం నాగేందర్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కదని మహేష్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలన సాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పాలకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మహేష్ కుమార్ యాదవ్ అన్నారు.