telangana
రాజ్యాంగ విలువలే ప్రజాస్వామ్యానికి పునాది - జిఎం ఎన్ రాధాకృష్ణ
సూర్య, మందమర్రి : భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హృదయం వంటిదని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు అనుసరించాల్సిన ప్రాథమిక విలువలు, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించిన మహోన్నత పత్రం అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన ప్రగాఢ పరిజ్ఞానం, దూరదృష్టి, సమానత్వ భావజాలం నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. సింగరేణి సంస్థలో ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో పారదర్శకత, నిజాయితీ, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను ఆచరించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కార్యాచరణలోకి తీసుకువచ్చినప్పుడే సంస్థ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకుంటూ, తమపై ఉన్న బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ కార్తీక్, జనరల్ మేనేజర్ కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.