-పాఠశాల స్థాయి నుంచే నూతన ఆలోచనా దృక్పథం అలవర్చుకోవాలి అనిల్ కుమార్ మోకరాల
పటాన్చెరు; విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని మై విజ్ సంస్థ సహ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మోకరాల సూచించారు. పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ పరిధిలోని విజ్ఞాన్ విద్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ‘తరంగ్–2026’ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనిల్ కుమార్ మోకరాల మాట్లాడుతూ చదువుతోపాటు ఆటపాటలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంత ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రమశిక్షణ, విలువలు, సృజనాత్మకత ఎంతో అవసరమని పేర్కొన్నారు.వేడుకల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు, హస్తకళలు,వ్యాపార స్టాళ్లు, సాంకేతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వస్తువుల తయారీ, ధరల నిర్ణయం, బడ్జెట్ రూపకల్పన, మార్కెటింగ్ వంటి అంశాలను విద్యార్థులే స్వయంగా నిర్వహించి తమ ప్రతిభను చాటారు.ఏఐపై ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహించడంతో పాటు విద్యార్థులు వివిధ ఆవిష్కరణలను ప్రదర్శించారు. చిన్నారుల తోలుబొమ్మల ప్రదర్శనలు, కళాకృతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మవల్లి మాట్లాడుతూ కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులు, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పాఠశాలలో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. తరగతి గది అభ్యాసాన్ని నిజజీవిత అనుభవాలతో అనుసంధానించడం ద్వారా విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.ఈ వేడుకలను తిలకించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.