నేటి నుంచి హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్
హైదరాబాద్: దేశ రహదారుల నిర్మాణ రంగంలో అత్యున్నత సంస్థ అయిన 'ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్' (ఐఆర్‌సీ) 85వ వార్షిక సదస్సు నేటి (నవంబర్ 19) నుంచి హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా ఘనంగా ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు (నవంబర్ 19 నుంచి 22 వరకు) జరగనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సదస్సు ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3,500 మంది ఇంజనీర్లు, రహదారి నిపుణులు, ఉన్నతాధికారులు, మౌలిక సదుపాయాల రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. రహదారుల అభివృద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం, కృత్రిమ మేధ (ఏఐ), పర్యావరణ హితమైన రోడ్ల నిర్మాణం, విద్యుత్ వాహనాల మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. కాగా, రానున్న రెండేళ్లలో రూ.93 వేల కోట్ల భారీ వ్యయంతో రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.