నజరేన్ గ్రామర్ స్కూల్లో నిలిచిన చదువులు.. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
మేడ్చల్,మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నజరేన్ గ్రామర్ స్కూల్లో నెలకొన్న పరిస్థితులు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, సుమారు 36 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు గత మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలో తరగతులు నిలిచిపోవడంతో విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తరగతులు నిలిచిపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని, ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తమ పిల్లల చదువుల పరిస్థితిపై సమాధానం చెప్పేవారు లేకపోవడంతో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.మరోవైపు పాఠశాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై కూడా పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల నిర్వహణతో సంబంధం లేని వ్యక్తుల జోక్యం ఉందని, పాఠశాల నిధులు అధికారిక బ్యాంకు ఖాతా ద్వారా కాకుండా వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ఒకవైపు ఉపాధ్యాయుల వేతన సమస్యలు, మరోవైపు తరగతుల నిలిపివేతతో విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పాఠశాలలో తరగతులు నిర్వహించకపోతున్నా మేడ్చల్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుల వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలపై స్పష్టత ఇవ్వడంతో పాటు వెంటనే తరగతులు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు పాఠశాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు, యాజమాన్య నిర్లక్ష్యం మధ్య విద్యార్థుల చదువులు బలికాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యంతో పాటు విద్యాశాఖ అధికారులపైనా ఉందని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు.