మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు
శామీర్‌పేట, మేజర్ న్యూస్: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు సహకార సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 240 నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఏర్పాటుకు ఈ నెల 11న ప్రభుత్వ మెమో జారీ చేసింది. ఇందులో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంజూరు కానుంది.ఈ సంఘం ఏర్పాటుతో మూడు చింతలపల్లి ప్రాంత రైతులకు వ్యవసాయ సహకార సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలను సులభంగా పొందే అవకాశం కలగనుంది. ఇప్పటివరకు ఈ సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న రైతులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.నూతన సహకార సంఘం ఏర్పాటుతో స్థానికంగా వ్యవసాయ సహకార వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు రైతులకు ఆర్థికంగా, వ్యవసాయపరంగా మరింత చేయూత లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మూడు చింతలపల్లి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంఘం ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.