మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు భారీ లీకేజీ -- 24 గంటల పాటు నీటి సరఫరా బంద్.. -- 245 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలపై ప్రభావం
నారాయణపేట, సూర్యన్యూస్: నారాయణపేట జిల్లా మరికల్ సమీపంలోని మన్యంకొండ – నారాయణపేట ప్రధాన మార్గంలో ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడింది. దెబ్బతిన్న పైప్‌లైన్ భాగాన్ని తొలగించి కొత్త పైపును ఏర్పాటు చేసేందుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నవంబర్ 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారాయణపేట గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈఈ వెల్లడించారు. ఈ మరమ్మతుల కారణంగా దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాలపై ప్రభావం పడనుంది. దేవరకద్ర, నర్వా, మరికల్, ఉట్కూర్, నారాయణపేట, దామర్‌గిద్ద మండలాల్లో పూర్తిగా, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మక్తల్, ధన్వాడ మండలాల్లో పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. అలాగే మక్తల్, దేవరకద్ర, నారాయణపేట మున్సిపాలిటీల్లోనూ నీటి సరఫరా నిలిచిపోనుంది. మొత్తంగా 245 గ్రామాలు, మూడు మున్సిపాలిటీల ప్రజలు ఈ తాత్కాలిక అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తగా అవసరమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. పైప్‌లైన్ మరమ్మతు పనులు పూర్తయి నీటి సరఫరా పునరుద్ధరించే వరకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.