లక్ష్మినారాయణపూర్‌లో విషాదం.. ఆర్మీ జవాన్ మల్లేశం మృతి
యాలాల,మేజర్ న్యూస్:వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మినారాయణపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బోయిని మల్లేశం మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన సోమవారం ఉదయం మృతి చెందినట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుండగా, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.నిరుపేద కుటుంబం నుంచి ఎదిగిన మల్లేశం సైన్యంలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలిచారు. తన ముగ్గురు అక్కాచెల్లెళ్ల వివాహాలను ఘనంగా నిర్వహించి కుటుంబ బాధ్యతలను నెరవేర్చారు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో ఆర్మీ విధులు నిర్వహిస్తున్న ఆయన దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.