ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం...
రామచంద్రపురం, మేజర్ న్యూస్.గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, అదే నమ్మకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ప్రజలకు పిలుపునిచ్చారు. రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి సుభాష్, ఎంపీలు సానా సతీష్, గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘చెప్పాం.. చేస్తున్నాం..’ పేరుతో రూపొందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. చెప్పడం మాత్రమే కాదు.. చెప్పిన ప్రతి మాటను చేతల్లో చూపిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని, కులమతాలు, వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పాలన అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు.గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల్లోనూ ప్రజల మద్దతు అవసరమని, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి సుభాష్ కోరారు.
రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో అభివృద్ధి వేగవంతం కావాలి.. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి. ఈ లక్ష్యాలను సాధించాలంటే స్థానిక సంస్థల్లో కూటమి బలపడాలి అని సానా సతీష్ అన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతోపాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
అభివృద్ధి అనేది కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరాలి. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి. ప్రతి పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. పేద కుటుంబాలకు సంక్షేమ భరోసా కలగాలి. ఈ లక్ష్యాలతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని ఎంపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన కరపత్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల వివరాలను తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ ప్రజలు కూటమికి అండగా నిలవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతి, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.