కొలత పట్టకుంటే.. ట్రాఫిక్ నియంత్రణ కష్టమే
కొలత పట్టకుంటే.. ట్రాఫిక్ నియంత్రణ కష్టమే
నేరేడుచర్ల మేజర్
నేరేడుచర్ల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పెద్ద సమస్యగా మారింది. వాహనాల రాకపోకలు,, దుకాణాల దగ్గర వినియోగదారుల వాహనాల నిలుపుదల తో ఉన్న కాస్త రోడ్డు ఇరుకుగా మారడంతో నిత్యం చిన్న, పెద్ద వాహనాల రాకపోకలతో ఇబ్బందిగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి.
వీధి వ్యాపారులు, ఉన్న వ్యాపార దుకాణాల స్థలానికి మించి ఫుట్ పాతుల వరకు వారి వ్యాపారాలను తొలగించడంతో మరింత క్లిష్ట పరిస్థితి ఏర్పడింది.
దీనికి తోడు అక్రమ నిర్మాణాల పొడగింపులతో నేరేడుచర్ల ప్రధాన కూడలి తోపాటు జాన్ పహాడ్ రోడ్డు, రామాపురం రోడ్డు, హుజూర్నగర్, మిర్యాలగూడ రోడ్డులు మొత్తం మూత వేసినట్లుగా మారిపోయింది.
గతంలో ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు జరగకముందు మునిసిపాలిటీకి పూర్వం నగర పంచాయతీగా ఉన్న సమయంలో అప్పటి నేరేడుచర్ల ఎస్సై బలవంతయ్య, పంచాయతీ కార్యదర్శి సుందరయ్య ఇతర అధికారులతో కలిసి రోడ్డును విస్తరించి, అక్రమ నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ నియంత్రణ చేసి సౌలభ్యంగా ప్రజలకు అందించినప్పటికీ తిరిగి యధాస్థితి కొనసాగుతుండడంతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు మొదలవుతున్నాయి.
అక్రమ నిర్మాణాల తొలగింపులో రాజకీయ జోక్యం లేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకొని నేరేడుచర్ల పట్టణాన్ని , రద్దీరహితంగా చేసి ప్రజలకు సౌలభ్యంగా చేసే ప్రయత్నంలో భాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పాలకమండలి చర్యలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులతోపాటు, మండల అధికారుల సహకారం కోరుతూ సమావేశం ఏర్పాటు చేసుకొని చర్యలకు నిర్ణయించినప్పటికీ జాప్యం కారణంగా సమస్య తీవ్రమవుతోంది.
మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు పూర్తిస్థాయి ప్రయత్నం చేయనప్పటికీ అనుమతి లేని పార్కింగ్లో నిలుపుదల చేసిన వాహనాల చలాన్ల విషయంలో మాత్రం నిత్యం సిబ్బంది నిమగ్నమై ఉండడం కొంతమేర , అడ్డగోలుగా పార్కింగ్ చేసే వ్యక్తుల విషయంలో నియంత్రణకు ఉపయోగకరమైనప్పటికీ పూర్తిస్థాయిలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మునిసిపాలిటీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అఖిలపక్ష నాయకులు అధికారులు త్వరితగతిన ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టి నేరేడుచర్ల పట్టణంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతున్నారు