telangana
కరువు మండలాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
సూర్య నస్పూర్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య అన్నారు. శుక్రవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రేగుంట చంద్రశేఖర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించగా, మంచిర్యాల జిల్లాలో 11 మండలాలు ఉన్నాయని తెలిపారు. కరువు మండలాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా కరువు పరిస్థితులు నెలకొన్న మండలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని కూడా కరువు మండలాలుగా గుర్తించాలని కోరారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేషన్ బియ్యం పంపిణీని అరకిలో నుంచి 10 కిలోలకు పెంచి అందించాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యులపై జీవన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 10వ తేదీన మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రైతులు, కార్మికులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ బిసి మండల కార్యదర్శి జోగుల ఆంజనేయులు, అల్ల లచ్చిరెడ్డి, కోడి వెంకటేశం, బాకం శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.