telangana
జనవరి 3న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర తృతీయ మహాసభలు
కొంపల్లి మేజర్ న్యూస్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం తీర్మానించింది. అలాగే వచ్చే జనవరి 3న హైదరాబాద్‌లో రాష్ట్ర తృతీయ మహాసభలను నిర్వహించాలని నిర్ణయించింది. మహాసభలను విజయవంతం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ అధ్యక్షుడు పిల్లి రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. యాక్టింగ్ అధ్యక్షుడు పి. రాంచందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య గత కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లా యూనిట్ల ప్రతినిధులు, రాష్ట్ర కార్యాలయ బేరర్లు వివిధ అంశాలపై చర్చించిన అనంతరం జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజహితం కోసం జర్నలిస్టులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర జిల్లాల్లోని జర్నలిస్టు సొసైటీలకు ఇళ్ల స్థలాలను త్వరితగతిన కేటాయించాలని కోరారు. ఖమ్మం జర్నలిస్టులకు ఇప్పటికే కేటాయించిన స్థలాలను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల జారీకి పోలీస్ విచారణ చేపడుతున్నారని, ఇలాంటి విధానాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే జర్నలిస్టులపై అకారణంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, బలహీన వర్గాల తరఫున గొంతెత్తే జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపాలని కోరారు. ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు జర్నలిస్టులకు జర్నలిస్టు హెల్త్ కార్డులు ఉపయోగపడటం లేదని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటకొండ కృష్ణ, గుడిగ రఘు, పి. మాణిక్ ప్రభు, బి. రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు బి. దయాసాగర్, సలీమా, ఈ. చంద్రశేఖర్, గండ్ర నవీన్, బి. జగదీష్, కొప్పు నిరంజన్, వెంకటేష్, పి. బిక్షపతి, విజయానంద్‌రావుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.