*ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సందడి.. లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్న డిప్యూటీ సీఎం!*
*లబ్దిదారుల ఇందిరమ్మ ఇళ్లల్లో దగ్గరుండి గృహప్రవేశం చేయించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క*
మధిర, సూర్య మేజర్ న్యూస్:
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో ఈ ఏడాది దీపావళి పండుగను 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' పేరిట రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. దశాబ్దాలుగా గుడిసెల్లో, అద్దె ఇళ్లల్లో చీకటి బతుకులు వెళ్లదీసిన పేద కుటుంబాలు తమ సొంత ఇందిరమ్మ ఇళ్లలో తొలిసారిగా దీపావళి దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లల్లో ఈ పండుగ సంబరాలు జరిగాయి. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మధిర మండలం దెందుకూరు గ్రామంలో దాదాపు 64 ఇళ్ళను లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేశారు.లబ్ధిదారులు తమ కుటుంబాలతో కలిసి కొత్త ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తూ దిగిన ఫోటోలను 'ఇందిరమ్మ ఇళ్ల' మొబైల్ అప్లికేషన్ ద్వారా, అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలోని మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఆదివారం దీపావళి పర్వదిన సందర్భంగా లబ్ధిదారుల నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లల్లో స్వయంగా దగ్గరుండి గృహప్రవేశం చేయించి వారితో కలిసి దీపావళి సంబరాలను ఇందిరమ్మ గృహాల్లో దీపాలు వెలిగించి జరుపుకున్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.