గ్రామాల అభివృద్ధిపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
• గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
• మిట్టపల్లి, గుల్లకోట గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల పరిశీలన
• ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రభుత్వ భవనాలకు కమ్యూనిటీ సోక్‌పిట్లు నిర్మించాలి
• విబి - జి రామ్ జి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
• అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య
లక్షెట్టిపేట, సూర్య:
గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి, గుల్లకోట గ్రామ పంచాయతీలను సందర్శించిన ఆయన వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
మిట్టపల్లి గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, విబి - జి రామ్ జి పనులు, పారిశుధ్య కార్యక్రమాలు, నర్సరీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందించాలని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విబి - జి రామ్ జి పనుల్లో కూలీల సంఖ్యను పెంచి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అనంతరం గుల్లకోట గ్రామ పంచాయతీలో పర్యటించి విబి - జి రామ్ జి పథకంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు, విలేజ్ ఆర్గనైజేషన్ (వి ఓ) భవనం, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులతో పాటు పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించడంతో పాటు ప్రతి ప్రభుత్వ భవనానికి కమ్యూనిటీ సోక్‌పిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఊటకుంటలు నిర్మించి వర్షపు నీటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి. అనిల్ కుమార్, మిట్టపల్లి, గుల్లకోట గ్రామాల సర్పంచులు బానేష్, దేవమణి, ఏపీవో వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శులు రాజమణి, సత్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.