దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు
పటాన్‌చెరు;సేవా భావం, దాతృత్వం,మానవత్వానికి ప్రతిరూపంగా గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు నిలిచారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని "జాయ్ ఆఫ్ గివింగ్" పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారుల్లో ఆనందాన్ని నింపారు. మియాపూర్‌లోని వివేకానంద సేవా సంఘానికి చెందిన 41 మంది చిన్నారులను శుక్రవారం గీతం ప్రాంగణానికి ఆహ్వానించి రోజంతా వారితో ఆనందంగా గడిపారు.ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంబీఏ విద్యార్థులు చిన్నారుల కోసం వివిధ రకాల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక పోటీలు నిర్వహించారు. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతోపాటు, సమాజంలో తమకు అండగా నిలిచే ఎంతోమంది ఉన్నారనే భరోసా కల్పించేలా కార్యక్రమాలను రూపొందించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు.కార్యక్రమ ప్రారంభోత్సవంలో గీతం బీ-స్కూల్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పాల్గొని విద్యార్థుల సేవా దృక్పథాన్ని అభినందించారు. ఇలాంటి మంచి సంప్రదాయాన్ని ప్రతి ఏడాది కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాల్లో కరుణ, దయ, ఇతరుల పట్ల సేవాభావం ఎంతో ముఖ్యమైనవని వివరించారు.ఈ సందర్భంగా వివేకానంద సేవా సంఘం చిన్నారులకు స్వెట్టర్లు, టీ-షర్టులు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. వారి విద్యావసరాలకు తోడ్పాటుగా విద్యార్థులు, అధ్యాపక బృందం తమవంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యాపకులు డాక్టర్ నాగప్రియ, డాక్టర్ శ్రీకాంత్, విద్యార్థి నిర్వాహకులు శ్లోక, సుచిత సమన్వయం చేశారు.చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ, వారిలో కొత్త ఆశలు చిగురింపజేసిన ఈ కార్యక్రమం సేవాభావానికి, మానవత్వానికి చక్కని నిదర్శనంగా నిలిచింది.