చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం!
చందానగర్,మేజర్ న్యూస్ : చందానగర్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్‌లో ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతీయ రహదారి-65 (NH-65) నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డు మీదుగా అమీన్‌పూర్ వరకు దాదాపు ₹45 కోట్ల అంచనా వ్యయంతో 2.7 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల ప్రధాన రహదారి, రెండు లైన్ల సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చేపడుతున్న లింక్ రోడ్డు పనులు మరియు నాలాపై నిర్మిస్తున్న అత్యాధునిక బాక్స్ కల్వర్టు పనుల పురోగతిని ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు.
నాణ్యత పాటించాలి – నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండొద్దు:
పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా నాలాపై నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు ద్వారా వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగిపోయేలా డిజైన్ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, రహదారి నిర్మాణ సమయంలో వాహనదారులకు, స్థానిక కాలనీ వాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ రాజకీయ నాయకులు రఘునాథ్ రెడ్డి, నరేందర్ బల్లతో పాటు సంబంధిత మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.